Vijayalanicce vijayadasami విజయాలనిచ్చే విజయదశమి దసరా #dussehra #Dasara

 

Vijayalanicce vijayadasami  విజయాలనిచ్చే విజయదశమి #dussehra #Dasara
Dussehra
 

విజయాలనిచ్చే విజయదశమి



    హైందవులు పది రోజులపాటు పవిత్రంగా జరుపుకునే పండుగ. తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించి పదవరోజు ఆనందంగా జరుపుకునే పండుగ. ఇంటిల్లిపాది కొత్తబట్టలు ధరించి సరదా సరదాగా జరుపుకునే పండుగ దసరా పండుగ. దీనినే విజయదశిమి అని కూడా అంటారు. ఇది హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగలో మొదటి మూడు రోజులు పార్వతిదేవికి, తరువాతి మూడు రోజులు లక్ష్మీ దేవికి, ఆ తరువాతి మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం కూడా ఈ పండుగలో ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేసి, పదవరోజు పార్వేట చేస్తారు.

 

    తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్యనుండి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. రాముడు రావణుని పెగెలిచిన రోజు విజయదశమి అని చెబుతారు. ఈ రోజున రావణ వధ కార్యక్రమం నిర్వహిస్తారు రావణసురుని భారీ దిష్టిబొమ్మను తయారు చేసి తగులబెడతారు. అలాగే ఈ రోజున జమ్మి పూజ చేయడం ఆచారం. మహిషాసురుడనే రాక్షసునితో దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసి విజయం పొందిన సందర్భాన్ని 10వ రోజున ప్రజలందరు ఆనందంగా జరుపుకున్న పండుగే విజయదశమి.
     

విజయదశిమికి సంబంధించి ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది. మహిషాసురుడు అనే రాకసుడు తీవమైన తపస్సుచేసి పురుషులతో మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకున్నాడు. అప్పుడు వారిలో రగిలిన క్రోధాగ్ని ఓ ప్రకాశవంతమైన తేజంగా మారింది. ఆ తేజం ఒక స్త్రీరూపంగా ఆకృతి దాల్చింది. మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు సర్వదేవతలు ఆయుధాలు ఇచ్చారు. వాటితో మహిషాసురుని తరఫున యుద్ధం చేస్తున్న రాక్షసులందరిని సంహరించింది. తరువాత మహిషాసురునితో తలపడి, భీకర పోరాటం చేసి మహిషాసురుడిని సంహరించింది. అప్పటి నుండి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆ రోజును విజయదశిమి పర్వదినంగా ప్రజలు జరుపుకుంటున్నారు. ఆ దేవి మహిషాసుర మర్ధినిగా వాసికెక్కింది.

 

ఈ రోజున ఉపాధ్యాయులు పాఠశాల పిల్లలతో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం సంప్రదాయంగా ఉండేది. వీటిని దసరా వేషాలు అనేవాళ్లు. వాళ్లిచ్చింది పుచ్చుకోవడాన్ని దసరా మాములు అనేవారు. విద్యార్థులు "ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా.. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు" అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ విద్యార్థులు తమ ఉపాధ్యాయుని వెంట ఇంటింటికి తిరిగేవారు. గృహస్తులు ఇచ్చిన కానుకలు సేకరించేవారు. ఈ ఆచారం ప్రస్తుతం కనుమరుగయింది.


      విజయదశమి రోజున కొత్త వ్యాపారాలు, కొత్త పనులు ప్రారంభిస్తే విజయవంతంగా కొనసాగుతాయని విశ్వసిస్తారు. చాలామంది తమ కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ రోజు కోసం వేచి ఉంటారు. విద్యార్థులు కొత్త విద్యలు నేర్చుకోవడం ఈ రోజున ప్రారంభించవచ్చు. ఈ రోజున ముఖ్యంగా జమ్మీ పూజ చేస్తారు. సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని పూజించి, 'శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ, అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ' అనే శ్లోకం చదువుతూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప, శనిదోష నివారణ జరుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. పూజించిన జమ్మి ఆకులను బంగారం అని వ్యవహరిస్తారు. ఈ ఆకులను ఇంట్లో ధనం భద్రపరచుకునే చోట ఉంచితే ధనవృద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు. బంగారం అని వ్యవహరించే జమ్మి ఆకులను ముందు దేవుడి దగ్గర ఉంచి ఆశీర్వాదం కోరుకుంటారు. అనంతరం ఇంట్లో ఉన్న పెద్దవారి చేతిలో బంగారం ఉంచి పాద నమస్కారం చేసి ఆశీర్వచనాలు పొందుతారు. తెలిసిన పెద్దవారింటికి, బంధువుల ఇంటికి వెళ్లి బంగారం పెట్టి నమస్కరిస్తారు. సమాన వయస్కులు ఒకరి చేతిలో ఒకరు బంగారం ఉంచి ఆలింగనం చేసుకుంటారు. దీనిని తెలంగాణలో అలాయి బలాయి అని వ్యవహరిస్తారు. దసరా పండుగ రోజు నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టను చూడడం అదృష్టంగా, శుభ సుచికంగా భావిస్తారు. విజయాలకు ప్రతీకగా పాలపిట్టను చెబుతారు. విజయదశమి రోజున పాల పిట్ట కనిపిస్తే విజయం దక్కినట్లేనని పండితులు చెబుతున్నారు.

    ఎప్పటికైనా చెడు ఓడిపోతుంది, మంచే గెలుస్తుందన్న సందేశం దసరా ద్వారా వెళ్లడవుతుంది. దసరా నాడు రామలీల ద్వారా శ్రీరాముడి జీవిత కథను పాటలు, నాటకాల రూపంలో ప్రదర్శిస్తారు. తద్వార యువతకు, ముందు తరాల వారికీ దసరా చరిత్ర తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా గుర్తింపు పొందింది. వారణాసిలో శ్రీరామ కథను నెల రోజుల పాటు ప్రతి రోజూ వినిపిస్తారు. అక్కడి రామనగర్‌లో జరిగే రామలీల 31 రోజుల పాటూ కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ సంప్రదాయ ఆచారాన్ని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో భారతీయ వారసత్వ సంపదగా గుర్తించింది.

-- నూతి శివానందం


Tags: dussehra,INDIAN MYTHOLOGY,

Post a Comment

Previous Post Next Post