రాకాసిలోయ (చందమామ)_15 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

 RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

రాకాసిలోయ (చందమామ)_15

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_15

    కోయ యువకుల వెంట అరణ్యంలో కొంత దూరం ప్రయాణించే సరికి, కేశవుడూ వాళ్ళకు, తాము బ్రహ్మపురరాజ్య సరిహద్దులు దాటి పారిపోవటం అంత తేలిక కాదని అర్థమైపోయింది. బ్రహ్మపుర సేనా నాయకుడు పంపిన సైనికులు అరణ్య మార్గాల వెంట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అంతేకాక, అర్ధరాజ్యం వస్తుందన్న ఆశతో కొందరు ఆటవికులు కేశవుడి కోసం చెట్టూ పుట్టలూ వెతుకుతున్నారు. ఇంతమంది కనుగప్పి పారిపోవటం సాధ్యమా? అన్న అనుమానం ముగ్గుర్నీ బాధించసాగింది.


    “రాజ్య సరిహద్దులు దాటిపోయేందుకు సైనికుల కెవరికీ తెలియని రహస్య మార్గాలు మీకేమైనా తెలుసా?" అని కేశవుడి ముసలి తండ్రి, కోయ యువకుల్ని ప్రశ్నించాడు.


    “మాకు ఈ అరణ్యంలో తెలిసిన అనేక రహస్య మార్గాలున్నవి. వాటిల్లో ఏ ఒకటి బ్రహ్మపుర సైనికులకు తెలియదని నా నమ్మకం. మనకు ప్రమాదం వచ్చేది వాళ్ళనుంచి కాదు. రాజు యిస్తానన్న అర్ధ రాజ్యానికి ఆశించి, మిమ్మల్ని పట్టుకోజూస్తున్న ఆటవికులే మనకు ప్రమాదకారులు. వాళ్ళక్కూడా అన్ని గుప్తమార్గాలు తెలుసు." అన్నాడొక కోయ యువకుడు. అంతలో వాళ్ళకు ఎదురుగా వున్న కొండరాళ్ల మీద కొందరు సైనికులు కనిపించారు. వాళ్ళ వెంట ఇద్దరు ఆటవికులు కూడా వున్నారు.


    “అందరూ చెట్లచాటుకు పదండి, సైనికులు మన కేసే వస్తున్నట్టున్నది." అంటూ కోయ యువకులు చప్పున వెనుదిరిగి, చెట్ల మాటుకు పరిగెత్తారు. కేశవుడూ, జయమల్లూ, ముసలివాడూ కూడా వాళ్ళ వెంట పరిగెత్తారు.


    అందరూ చెట్లచాటున దాక్కుని, సైనికులకేసి చూడసాగారు. జయమల్లు పెద్దగా నిట్టూరుస్తూ, “మేం కోయవేషాలు వేసుకున్నాం గదా, అలాంటప్పుడు సైనికులతో దాగుడు మూత లెందుకు ? నిర్భయంగా వాళ్ళు చూస్తుండగానే రాజ్యసరిహద్దులు దాటవచ్చునే!" అన్నాడు.


    “సైనికులకు మీరు కోయవాళ్ళలా కనిపించవచ్చునేమోగాని, వాళ్ళ వెంటవున్న ఆటవికులు మీరెవరైందీ వెంటనే పసికట్టగలరు.” అన్నాడొక కోయ యువకుడు. జయమల్లు అతణ్ణి మరేదో అడగబోయేంతలో వెనకవైపు నుంచి పెద్ద కలకలం వినబడింది. చప్పున అందరూ అటుకేసి తిరిగిచూశారు. దూరంగా చెట్లచాటు నుంచి తమకేసే వస్తున్న సైనికులు కొందరు వాళ్ళకు కనిపించారు.


    “వాళ్లింకా మనను చూడలేదు. మనం ఎటు పారిపోయేందుకు అవకాశం వున్నట్టు లేదే !" అంటూ కేశవుడూ విల్లంబులు చేతికి తీసుకున్నాడు. కోయయువకుడు అతణ్ణి వారిస్తూ, “అంతమందితో మనం యుద్ధం చెయ్యలేం. అదుగో, ఆ కనబడే గుహల్లో ఎక్కడైనా దాక్కుందాం," అంటూ కొండకేసి బయలుదేరాడు.


    అందరూ చెట్ల చాటున నక్కుతూ, ముందుకు కదిలారు. ఎదురుగా కొండ పాదంలో వాళ్ళకు చాలా గుహలు కనిపించినై, సైనికులు తమ కోసం ఆ గుహలు వెతకటం ప్రారంభిస్తే, తాము బోనులో చిక్కిన ఎలుకల్లా దొరికిపోతారు. ముసలివాడు ఈ అనుమానాన్ని కోయ యువకులకు చెప్పాడు. వాళ్ళనూ యిలాంటి అనుమానమే బాధిస్తున్నది. చెట్ల చాటున దాక్కునే అవకాశం లేదు. తమను అన్ని వైపుల నుంచి సైనికులు చుట్టుముట్టుతున్నట్టున్నది. బహుశా, వాళ్ళు గుహల్లో తమ కోసం వెతికేందుకు వస్తున్నారు. అదృష్టమల్లా, ఇంతవరకూ తాము వాళ్ళ కంట బడకపోవటం!


    హఠాత్తుగా ముందు నడుస్తున్న కోయ యువకుడు ఆగిపోయాడు. అతడి మార్గానికి ఎదురుగా వున్న ఒక రాతి చాటు నుంచి, ఒక నక్క ఎగిరి దూరంగా దూకింది. ఆ వెంటనే రెండు చిన్న పిల్లలు దానికేసి పరిగెత్తినై. కోయయువకుడు బాణం తీసి, తల్లి నక్కను దూసుకుపోయేట్లు వదిలాడు. అది వెనక్కు తిరిగి చూడకుండా, ఎదురుగా వున్న గుహల్లో ఒకదాని కేసి దౌడుతీసింది.


    “అదృష్టం కొందికీ మనకీ నక్క ఎదురైంది. అది ప్రవేశించిన గుహ చూశారు గదా? మనం కూడా దాంట్లోకే వెళదాం." అన్నాడు కోయ యువకుడు.


    “సైనికులు ఆ గుహలన్నీ గాలించేందుకే వస్తున్నారు.” అన్నాడు జయమల్లు.


    “వస్తే ఏం? మనం ఆ గుహలో వుండం గదా! శత్రువు నుంచి పరిగెత్తే నక్క ఏది, పారిపోయేందుకు మరో మార్గంలేని గుహల్లో ప్రవేశించదు. పైగా, అది పిల్లల నక్క!" అన్నాడు కోయ యువకుడు.


    కేశవుడూ, అతడి ముసలి తండ్రీ, జయమల్లూ పొందిన ఆశ్చర్యం అంతా యింతా కాదు. వాళ్ళ కోయ యువకుల వెంట పరిగెత్తి గుహలో ప్రవేశించారు. గుహ అంతా చిమ్మచీకటిగా వున్నది. ఎక్కడా వెలుగు లేదు. కోయ యువకుడి ఊహ తప్పని ఆ ముగ్గురూ భావించారు.


    “గుహలో నుంచి బయటికి పోయేందుకు మరో మార్గం వున్నట్టు లేదే ?" అన్నాడు జయమల్లు నిస్పృహగా, కోయ యువకులిద్దరూ మెల్లిగా ఏమో మాట్లాడుకోసాగారు. కేశవుడు, గుహలో నుంచి తల బయటికి పెట్టి అన్ని వైపులకూ కలయ చూశాడు. సైనికులూ, వాళ్ళకు దారిచూపుతున్న ఆటవికులూ గుహల కేసే వస్తున్నారు.


    కేశవుడు చప్పున వెనుదిరిగి ఏదో అనబోయేంతలో, కోయ యువకుడి చేతిలో కాగడా గప్పున వెలిగింది. అతడు, జయమల్లు కేసి తిరిగి, “నక్క యింకా ఈ గుహలోనే వున్నదని మీ అనుమానమా ?" అంటూ నవ్వి, “అది వెళ్లిన మార్గానే మనం పోవలసి వుంటుంది,” అంటూ ముందుకు కదిలాడు. అందరూ కలిసి గుహలో ఓ ఇరవై అడుగుల దూరం నడిచేసరికి, హఠాత్తుగా పెద్దగాలి తాకి, కోయ యువకుడి చేతిలోని కాగడా గప్పుమంటూ ఆరిపోయింది.


    “చూశారా, గుహ నుంచి బయటికి పారిపోయేందుకు మార్గం ఎక్కడ వున్నదో తెలిసి పోయింది." అంటూ కోయ యువకుడు పక్కకు రెండడుగులు వేసేసరికి, పైనుంచి పెద్ద వెలుగు అతడి మీద పడింది. అతడు తతిమ్మా వాళ్లకు సౌంజ్ఞచేసి, అక్కడవున్న రాళ్ళ ఆధారంతో పాకుతూ, పైనున్న కంత అంచును గట్టిగా పట్టుకుని, ఒక్క ఊపులో పైకి వెళ్లిపోయాడు. మిగిలిన నలుగురు కూడా అతణ్ణి అనుసరించి, గుహలో నుంచి వున్న రహస్య మార్గంగుండా త్వరత్వరగా బయటికి వెళ్లారు.


    అక్కడ కొండ మీద నిలబడి చూస్తే, ఆ ప్రదేశమంతా నిర్జనంగా కనిపించింది. దూరంగా దిగువున ఒక నది ప్రవహిస్తున్నది. ఆ నదిలోకి చొచ్చుకు వచ్చిన ఒక కొండా, దానిమీది నుంచి నదిలోకి పడుతున్న ఒక జలపాతమూ వాళ్ళ కంటబడింది.


    “ఆ జలపాతం చాటున ఒక సొరంగం వున్నది. ఆ సొరంగం నీటి మార్గాన కొద్ది దూరం ప్రయాణించి, అవతలవున్న నది పాయను చేరవచ్చు. అది దాటితే కపిల రాజ్యం !" అన్నాడొక కోయ యువకుడు.


    అంతలో రెండవ కోయ యువకుడు చిన్నగా అరిచి, “చూడండి, చూడండి ! అదుగో, ఆ నది ఒడ్డున, గుట్టల చాటుగా సైనికుల శిబిరాలు కనిపిస్తున్నవి." అన్నాడు.


    అందరూ అటుకేసి చూశాడు. నది అంచున పది పన్నెండు డేరాలు వున్నవి. వాటి ముందు ఒక పెద్ద ఈటె పట్టుకుని ఒక సైనికులు నిలబడి వున్నాడు.


    “సైనికులందరూ మన కోసం కొండలూ గుట్టలూ గాలించేందుకు వెళ్లినట్టున్నది. ఆ ఒక్కడే కాపలా కాస్తున్నాడు. వాణ్ణి హతమారిస్తే, మనం నదిని నిరాటంకంగా దాటవచ్చు." అన్నాడు కేశవుడు, అవునన్నట్టు అందరూ తలలు వూపారు. కేశవుడు రొండిన వేలాడుతున్న చిన్న కత్తిని ఒరలో నుంచి లాగి, పిల్లిలా ఆ సైనికుడి కేసి నడవసాగాడు. సైనికుడి దృష్టి మరోవైపుకు మళ్ళీవున్నది.


    కేశవుడికి వెనకగా అందరూ బయలుదేరారు. ఒక్క బాణం దెబ్బతో సైనికుణ్ణి చంపవచ్చు. కాని, చచ్చేముందు వాడు కేకవేస్తే, తమ ఉనికి వాడి అనుచరులకు తెలిసి పోతుంది. వాణ్ణి కిక్కురు మనకుండా తుదముట్టించాలి!


    అందరూ యిలా ఆలోచిస్తూ, చడీచప్పుడూ లేకుండా రాళ్లచాటున నక్కుతూ వెళుతున్నారు. ఇంతలో కేశవుడు కాపలా సైనికుడి వెనకవున్న బండరాయిని చేరి, దాని వెనక నుంచి, ఒక్క వూపులో పైకెగిరి, సైనికుడి మెడకేసి కత్తి విసిరాడు. సైనికుడు కిక్కురుమనకుండా దుంగలా ముందుకు పడిపోయాడు.


    కేశవుడు లేచి నిలబడ్డాడు. అక్కడికి షుమారు నూరు గజాల దూరంలో నదీతీరం వున్నది. తీరాన నాలుగదు దోనె పడవలు నీటిలో తేలియాడుతున్నవి. కేశవుడు చేయి ఊపగానే అందరూ బిలబిల మంటూ నదీ తీరానికి పరిగెత్తారు.


    “అందరం కలిసి ఒకే దోనెలో వెళ్ళటం మంచిది. నదిలో కొన్నిచోట్ల సుడిగుండాలు వున్నవి. కాళీగా వున్న దోనె నొకదానిని ముందుకు తోస్తూ, వెనగ్గా మనం వెళ్ళాలి. అంత ప్రమాదం జరిగేటట్టుగా వుంటే, అందరం నదిలో దూకి ఈదక తప్పదు, "అన్నాడు కోయ యువకుడు.


    ఆ విధంగానే, అందరూ ఒక దోనెలో ఎక్కి కూచుని, మరొక దోనెను పెద్ద గడ కర్రతో ముందుకుతోస్తూ, జలపాతం వైపుకు కదిలారు. నదిలో చాలా సుడిగుండాలు వున్నమాట నిజం. అలాంటి ప్రదేశాల్లో ముందున్న దోనె చిక్కుకనే సమయానికి, దాన్ని పక్కకు నెడుతూ, తమ పడవ వాటిల్లో చిక్కుకోకుండా జాగ్రత్తపడుతూ, కొద్ది సేపటికల్లా జలపాతాన్ని సమీపించి, ఒక్క వూపులో దాని వెనకవున్న సొరంగ మార్గాన్ని చేరారు.


    సొరంగ మార్గంలో నది జలం విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్నది.


    జలపాతంలో నుంచి వెళ్ళేప్పుడు పడవలో వున్న వాళ్ళందరూ పూర్తిగా తడిచిపోయారు. "ఈ సొరంగం అంచులకు తగిలి దోనె ముక్కలు చెక్కలు కావటం తథ్యం," అన్నాడు ముసలివాడు. అంతలో ముందున్న కాళీ దోనె, సొరంగం అంచులకు గుద్దుకుని పెళ పెళ మంటూ విచ్చిపోయింది. ఇంతలో కేశవుడూ వాళ్ళున్న దోనె, దానిని వేగంగా తాకి తలకిందులైంది. దోనెలో వున్నవాళ్ళందరూ నది ప్రవాహంలో పడిపోయారు. "జ్యేష్ఠా, కనిష్ఠా! మీరెలావున్నారు ? మన కోయ అనుచరులు క్షేమమా !” అంటూ కేశవుడి ముసలి తండ్రి పెద్దగా కేక పెట్టాడు. ఆ కేకకు జవాబుగా ఒకేసారి నాలుగు గొంతులు పెద్దగా పలికినై. “అయ్యా, నువ్వు ఈదగలవా? సహాయంకావాలా?” అంటూ కేశవుడు తన తండ్రికేసి రాబోయాడు.


    “కనిష్ఠా! యిక్కడ అయ్య ఎవరు?" అంటూ ముసలివాడు కస్సుమని, “శిష్యులూ, కోయ గడేజంగ్ అనుచరులూ! అంతా సొరంగం అంచునున్న గండశిలలకు తగలకుండా జాగ్రత్తగా ముందుకు పదండి. ఈ మౌనానందుడు గజ ఈతగాడు, ఏం భయంలేదు," అన్నాడు.


    నాలుగైదు నిమిషాల కాలం సొరంగ జలంలో ఈదిన తరువాత హఠాత్తగా అందరూ నీటి ఉరవడి వల్ల ముందుకు నెట్టబడ్డారు. "ఈ వైపునా మరో జలపాతం వున్నట్టున్నది. మనం...” అంటూ కేశవుడు కీచుమన్నాడు.


    సొరంగ మార్గాన ప్రవహిస్తున్న నీరు, ముఫై, నలభై అడుగుల ఎత్తు నుంచి కింద వున్న నదిలోకి హూరుమనే శబ్దంతో పడుతున్నది. కేశవుడూ అతడి అనుచరులూ అంత ఎత్తు నుంచి దబీమంటూ నదిలోకి పడిపోయారు.


    ఒక్క క్షణకాలం అందరికి ప్రాణాలు కడబట్టినంత పనయింది. ఆ వెంటనే తెప్పరిల్లి ఒకరినొకరు పేరు పేరునా పిలుచుకుని, అందరూ సురక్షితంగా వున్నట్టు తెలుసుకుని, నది ఆవలి తీరానికి ఈదసాగారు.


    బాగా అలసిపోయి, ప్రాణాలు సొమ్మసిల్లివున్న ఆ అయిదుగురూ, తీరాన్ని సమీపిస్తూనే, దాని అంచున కత్తీ కటార్లు పట్టుకుని తమకేసే చూస్తున్న కొందరు ఆటవికుల్ని చూశారు.

ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post