రాకాసిలోయ (చందమామ)_06 RakasiLoya Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA)

      RakasiLoya 1-35 Janapada Novel by Dasari Subramanyam (CHANDAMAMA) 

రాకాసిలోయ (చందమామ)_06

 _దాసరి సుబ్రహ్మణ్యం

రాకాసిలోయ_06

    బ్రహ్మదండి మాంత్రికుడి తమ కేసి చూస్తూ చిరునవ్వు నవ్వటం, కాలభైరవుడు ఆకలితో నకనక లాడిపోతున్నాడనటం, కేశవుడికి భయం కలిగించింది. ఒకవేళ తనూ, జయమల్లూ మాట్లాడుకున్న మాటలన్ని, తన మంత్ర శక్తిచేత వాడు విన్నాడేమో అనుకున్నాడు కేశవుడు. ఇంక నాలుగైదు గంటల్లోపల తను మరణించటమో లేక బ్రహ్మదండి మాంత్రికుడు చావటమో తేలిపోతుంది.


    కేశవుడు యిలాంటి ఆలోచనలతోనే జయమల్లుతో పాటు చెట్ల కింద పడివున్న ఎండుపుల్లలు ఏరాడు. అవి బాగా పెద్ద మోపుకు సరిపడ అయింతరవాత యిద్దరూ కలిసి, వాటిని నెత్తిన పెట్టుకుని మాంత్రికుడున్న గుహకేసి బయలుదేరారు. ఒక అరగంట గడిచిం తరవాత వాళ్ళు గుహను సమీపించేసరికి, లోపలినుంచి బ్రహ్మదండి మాంత్రికుడు పఠిస్తున్న మంత్రాలు బయటికి వినబడుతున్నవి. కేశవుడూ, జయమల్లూ ఎండు పుల్లల మోపులను గుహముందు పడవేసి, అడుగులో అడుగు వేసుకుంటూ, చప్పుడు చెయ్యకుండా గుహలోపలికి వెళ్ళారు.


    బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుడి విగ్రహం ముందు బాచిపెట్టు వేసుక్కూచుని, పెద్దగా మంత్రాలు చదువుతూ, మధ్య మధ్య చేతిలో వున్న చిన్న చిన్న గులకరాళ్ళను విగ్రహం కేసి విసురుతున్నాడు. ఇదేం పూజ చెయ్యటం? అన్నట్టు కేశవుడు జయమల్లు కేసి సాంజ్ఞ చేశాడు. అతడు పెదాల మీద వేలు వేసుకుని, మాట్లాడకు అన్నట్టువురిమి చూశాడు.


    కొండమీది గుహలో మాంత్రికుడు కాలభైరవుణ్ణి గులకరాళ్ళతో పూజించి ప్రసన్నుణ్ణి చేసుకోవాలని ప్రయత్నిస్తూంటే, అక్కడ బ్రహ్మపురంలో ప్రజలూ, రాజుగారూ కూడా, పొరుగు రాజ్యపు సైన్యాలు తమమీద ఏ క్షణాన వచ్చి పడతవో అని గగ్గోలుపడి పోతున్నారు. రాజుగారూ, మంత్రీ కూడా కొండ మీద శత్రుసైనాలేవో చేరినవని నమ్మారు. ఆ నమ్మకం వల్లనే వాళ్ళు కొంత సైన్యాన్ని కొండ మీద ఏమున్నదో చూసేందుకూ, శత్రుసైన్యం వుంటే వాళ్లను హతమార్చేందుకూ పంపారు. కాని, అనుకోని విధంగా సైన్యాలు కొండ ఎక్కే సమయానికి, కొండ అంతా కంపించిపోయి, పెద్ద పెద్ద రాళ్ళు మీద పడటంతో సైనికులు చాలా మంది మరణించారు. చావగా మిగిలిన సైనికులు తిరిగివచ్చి కొండమీద తాము చూచిన దాన్ని గురించి రకరకాలుగా చెపుతున్నారు.


    రాజుగారి రహస్య మందిరంలో ఆయనతోపాటు, మంత్రి, కొత్తగా నియమింపబడిన సేనానాయకుడూ, రాజగురువూకూడా వున్నారు. సేనానాయకుడూ, మంత్రీ చెప్పింది విన్న తరవాత రాజు తన గురువు కేసి తిరిగి, “గురువర్యా, అంతా విన్నారు గదా? సైనికులు చెప్పేదాంట్లో మనం ఏది నమ్మాలి? ఆ కొండమీద వందల సంఖ్యలో శత్రు సైనికులు న్నారన్న మాట నమ్మాలా? లేక శరీరం అంతా నెత్తురు పూసుకుని, నిప్పులు చెరిగే కళ్ళతో, నెత్తిన పెద్ద శిఖతో భయంకరంగా వున్న మాంత్రికుడున్నాడన్న మాట నమ్మాలా? నా కేమీ పాలుపోవటం లేదు,” అన్నాడు.


    రాజగురువు ఓ క్షణకాలం ఆలోచించి తృప్తిగా తలాడిస్తూ, “ఈ రెండు మాటలూ నిజమే అని మనం ఎందుకు నమ్మగూడదు?" అని అడిగాడు.


    “మాంత్రికుడికీ, శత్రు సైనికులకూ పొత్తెలా కుదురుతుంది? ఆ మాంత్రికుడు కూడా శత్రురాజుకు సహాయం చేయవచ్చినవాడని మీ అభిప్రాయమా?" అన్నాడు రాజు అనుమానంగా.


    “ఆ సంగతి మాత్రం నేను యిదమిత్థమని తేల్చి చెప్పలేను. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ కొండ దగ్గరకు వెళ్ళిన మన సైనికులందరికీ మతులు పోయినై. వందల సంఖ్యలో శత్రు సైనికుల్ని చూసినవాళ్ళ మాట అటుంచి, అక్కడున్న మాంత్రికుడే కొండలో భూకంపం పుట్టించాడనికూడా కొందరు నమ్ముతున్నారు. పైగా, ఆ వింత జంతువు ఒకటి!" అంటూ రాజగురువు చిరునవ్వు నవ్వాడు.


    “అలాంటి జంతువు వుండే అవకాశమే లేదంటారా? నేనూ మొదట నమ్మలేదు. కాని, ఆ మాంత్రికుణ్ణి గురించి విన్న తరవాత..." అంటూ మంత్రి నీళ్ళు నమిలాడు.


    “మంత్రీ, నేనూ కొద్దీ గొప్పో మంత్రశాస్త్రం చదివినవాణ్ణి!” అంటూ రాజగురువు చిరుకోపంగా మంత్రికేసి చూశాడు.


    “గురువర్యా, అందుకేగదా మిమ్మల్ని యిక్కడికి రావలసిందిగా కోరింది. మీ సహాయం లేకుండా మేము చేయగలిగిందేమీ లేదు,” అన్నాడు రాజుగారు బతిమాలుతున్నట్టు.


    "సరే, కేవలం ఊహించిన వాటి సాయంతో మనం ఏం నిర్ణయాలు చేయగలం? తమ అంగరక్షకుడి నాయకత్వాన కొండ దగ్గరకు వెళ్ళిన సైనికుల్ని తిరిగి రానివ్వండి," అంటూ రాజగురువు లేచి గది బయటికి వచ్చాడు.


    రాజుగారు పంపగా, కొండమీద ఎవరున్నారో, అక్కడి పరిస్థితులెలా వున్నవో చూచి వచ్చేందుకు బయలుదేరిన ఆయన అంగరక్షకుడు, వెంట వున్న ఇద్దరు సైనికులతో కొండదాపున గల అడవిలోకి చేరాడు. అల్లంత దూరాన భూకంపానికి ఎగుడు దిగుడుగా, ఒక రాయి మీద యింకో రాయి పడి వింత ఆకారాలు దాల్చి వున్న కొండను చూస్తూనే వాడి గుండెలు పీచుపీచుమన్నాయి. వాడి వెంట వున్న సైనికుల భయాన్ని గురించి చెప్ప వలిసిందే లేదు.


    “మీలో ఎవరైనా లోగడ ఈ కొండ ఎక్కారా? దారి మార్గాలు తెలిసినవాడు ఒక్కడుంటే ఎంత బావుండును!" అన్నాడు రాజుగారి అంగరక్షకుడు.


    అతడి వెంట వున్న సైనికుల్లో ఒకడు పూర్వం ఆ కొండ ఎక్కినవాడే. కాని, శత్రు సైనికుల్ని గురించిన కథలూ, వింత జంతువూ, మాంత్రికుడూ - ఇవన్నీ జ్ఞాపకం వచ్చి, వాడికి శరీరం జలదరిస్తున్నది.


    “అయ్యా, మనం కొండెక్కి చూసేదేముంటుంది? ఒకవేళ అక్కడ శత్రు సైనికులు గాని, మాంత్రికుడుగాని వుంటే, మనం ప్రాణాలతో అక్కడి సంగతులు రాజుగారికి చెప్పేందుకు బతికివుండం. ఒక వేళ అలాంటి వాళ్ళెవరూ అక్కడ లేకపోతే, మనం పని కట్టుకుని ఆ కొండ ఎక్కటం వృథా." అన్నాడా సైనికుడు.


    అంగరక్షకుడికి ఈ మాటలు బాగానే వున్నట్టు తోచినై. తను తిరిగి వెళ్ళి రాజుగారితో కొండమీద ఎవరూ లేరని చెపితే సరిపోతుంది. కాని, తన వెంట వున్న సైనికుల్ని నమ్మటం ఎట్లా? రాజుగారి నుంచి మెప్పు పొందేందుకు, వాళ్ళు తను కొండే ఎక్కలేదని ఆయనతో చెప్పేస్తే, తనకు ప్రాణాపాయం తప్పదు!


    "ఊహుఁ, అదేం లాభం లేదు. మనం కొండ ఎక్కి అక్కడెవరున్నారో చూడవలసిందే. శత్రువుల చేతిలో చచ్చామా, వీరస్వర్గం. బతికి బయటపడ్డామా, రాజుగారి నుంచి గొప్ప బహుమానాలు పొందవచ్చు. అయినా...ఎవడైనా ఒక్కడు దారి చూపేవాడుంటే బావుండునే...." అంటూ అంగరక్షకుడు తల గోక్కొంటూ కొండకేసి చూడసాగాడు.


    అంగరక్షకుడూ, సైనికులూ, ఏ చెట్టు కింద అయితే నిలబడి వున్నారో, ఆ చెట్టు మీదే కేశవుడి ముసలి తండ్రి కూచుని వున్నాడు. అతడు, తన కొడుకు వింత జంతువు నెక్కి కొండ మీదికి పారిపోయినప్పటినుంచీ, అక్కడ జరుగుతున్న సంగతులేవో చాలావరకు చూశాడు. మాంత్రికుడు గుహలో నుంచి బయటికి రావటం, తన కొడుకూ, అదే వయసు వాడైన మరి ఒకడూ కలిసి మాట్లాడుకుంటూ వుండటం - బ్రహ్మపుర సైనికుల దాడి, కొండలో పుట్టిన భూకంపం - సర్వం అతడు చూశాడు.


    తన కొడుకు ఎవడో మాంత్రికుడికి చిక్కిపోయాడన్న నమ్మకం ఆ ముసలివాడికి కలిగింది. తను ఒంటరిగా వెళ్ళి అతణ్ణి రక్షించటం ఎలాగా అని అతడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఈ సైనికులు చెట్టుకిందికి వచ్చి, ఆ కొండ ఎక్కాలని మాట్లాడుకుంటూ వుండటం, దారి చూపేవాడు వుంటే బావుంటుందని చెప్పుకోవటం, ముసలివాడికి ధైర్యం కలిగించింది.


    ముసలివాడు పిల్లిలా చెట్టుకొమ్మల్లోంచి మెల్లిగా కిందికి దిగి, ఆ పక్కనే వున్న మరో చెట్టు కిందికి వెళ్ళి వెల్లకిలా పడుకుని, కళ్ళు మూసుకుని, నిద్రలో ఏవో కలవరిస్తున్న వాడిలా శబ్దం చేశాడు. ఆ శబ్దం వింటూనే రాజుగారి అంగరక్షకుడికీ, సైనికులకూ పై ప్రాణాలు పైనే పోయినై ముగ్గురూ ఒక్కసారి ఎగిరి గంతేసి, ఆ ధ్వని వచ్చినవైపుకు చూశారు. వాళ్లకు చెట్టుకింద ముసలివాడు కనిపించాడు.


    "వీడే మాంత్రికుడై వుంటాడు! ఆ పొడవాటి గడ్డం చూశావా? వాడు నిద్రలో వున్నట్టుంది, గొంతు కోసేస్తే పీడ విరగడవుతుంది,” అన్నాడొక సైనికుడు.


    ఈ మాటలు వింటూనే, తనకు అనుకోని ప్రమాదం ఏదో కలగనున్నదని గ్రహించిన ముసలివాడు, ఆవిలిస్తూ లేచి కూచున్నాడు. ముసలివాడి వాలకం చూసి, వాడు మాంత్రికుడై వుండడని వూహించిన అంగరక్షకుడు, చప్పున ఒరలో నుంచి కత్తి దూసి, అట్టహాసం చేస్తూ అతడి దగ్గరకు వెళ్ళి, “ఎవర్రా నువ్వు? ఈ కొండ దగ్గిర అడవిలో నీకేం పని?" అని పళ్ళు కొరుకుతూ ప్రశ్నించాడు.


    ముసలివాడు జవాబు చెప్ప బోయేంతలో సైనికుల్లో ఒకడు, “నువ్వు మాంత్రికుడివా?" అని అడిగాడు. రెండోవాడు, “నువ్వు శత్రుదేశపు సైనికుడివా?” అని రెట్టించాడు.


    “అయ్యా, నేను మీరనుకునే  వాణ్ణేవర్నీ కాదు. ఈ అడివిలో కందమూలాలూ, ఆకలములూ తిని బతికే ఒక ముసలి వగ్గును. నన్ను చూసి మీరు శత్రు సైనికుడనుకోవటం వింతగా వున్నది." అన్నాడు ముసలాడు.


    "అలాగా, అయితే నీ ప్రాణానికి అపాయం కలగదని నేను అభయం యిస్తున్నాను. నేను స్వయంగా బ్రహ్మపుర రాజుగారి అంగరక్షకుణ్ణి! ఈ కొండమీద రాజద్రోహులెవరైనా వున్నారేమో; వుంటే హతమార్చాలని వచ్చాను. నీకు కొండమీది దారి తెరువులేమైనా తెలుసా?” అని అంగరక్షకుడడిగాడు.


    ముసలివాడు తన అరచేతిని, వెడల్పు చాచి, “ఇక్కడున్న గజిబిజి రేఖలూ, గుంటలూ సొట్టలూ ఎంత బాగా తెలుసో, కొండ మీది దారులు నాకంత బాగా తెలుసు," అన్నాడు.


    "అహాఁ, అవసరానికి భలే వాడివి కనబడ్డావ్. అయితే ముందుండి కొండమీదికి దారి తియ్యి. ఇవ్వాళ రేపో కాటికి ప్రయాణం కట్టే వాడివిలా వున్నావు గాని, లేకపోతే రాజుగారికి చెప్పి, నీకెన్ని బహుమానాలైనా యిప్పించే వాడిని," అన్నాడు అంగరక్షకుడు.


    ముసలివాడికి అంగరక్షకుడనే మాటలు చెవి కెక్కటం లేదు. ఈ బ్రహ్మపుర సైనికుల సాయంతో తన కొడుకు కేశవుణ్ణి, మాంత్రికుడి బారి నుంచి రక్షించుకోవాలన్నదే అతడి ఆరాటం. అతడు కొండకేసి నడవసాగాడు. కొంచెందూరం అతణ్ణి అనుసరించి పోయింతరవాత, అంగరక్షకుడికి ముసలివాడి చేతిలో వున్న కత్తి కనబడింది. వాడు ఆశ్చర్యపోతూ, “అడవిలో కందమూలాలు తిని బతికే నీకు ఈ కత్తి ఎందుకు?" అని అడిగాడు.


    “నేనూ, ఒకప్పుడు బ్రహ్మపుర రాజుగారి దగ్గర సైనికుడుగా వున్నాను - ఈ రాజుగారు కాదు, ఈయన తండ్రిగారి కాలంలో, అప్పటినుంచీ ఈ కత్తి నా వెంటనే వుంటున్నది,” అన్నాడు ముసలివాడు విసుగ్గా.


    ఆ మాటలు వింటూనే సైనికులు గుస గుస లాడారు. అంగరక్షకుడు వాళ్లకేసి ఉరిమి చూస్తూ, “మన ప్రాణాల కొచ్చిన భయం ఏమీలేదు. వాణ్ణి నమ్మలేకే ముందు దారి తియ్యమన్నాను. ఏదైనా మోసం జరిగేలా వుందో, వెనక నుంచి వాడి మెడ నరికేద్దాం,” అన్నాడు మెల్లిగా.


    ముసలివాడికి ఈ మాటలు వినిపించినా, వినపించనట్టె నటిస్తూ కొండ ఎక్కటం ప్రారంభించాడు.


ఇంకా వుంది...

Post a Comment

Previous Post Next Post